
నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడ ‘బాబూ’?
విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ సభలు నిర్వహిస్తున్న చంద్రబాబుకు నిరుద్యోగ భృతి అంశం పట్టడంలేదని మండిపడ్డారు. విజయనగరంలోని డీఎన్‌ఆర్ అమర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నెలలు కూటమి పాలనలో నిరుద్యోగ భృతి గల్లంతయ్యిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వలంటీర్లు, రేషన్ సిబ్బందిని తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా, విజయనగరం జిల్లాలోనే 4.68 లక్షల మంది ఉన్నారన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించకుండా కార్పొరేట్‌లకు సీఈఓలా ఉన్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రానికి బీజేపీ–టీడీపీ కూటమి ఏం చేసింది అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. నవంబర్ చివరి వారం నుంచి హిందూపురం–ఇచ్ఛాపురం వరకు నిరుద్యోగుల ఆవేదన యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి కోన శ్రీనివాసరావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, జిల్లా నాయకులు వాసు, అప్పన్న, కిరణ్, గోపినాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.