
చంద్రబాబు చేసింది శూన్యం
చీపురుపల్లి(గరివిడి): రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసినది దివంగత మహానేత వైఎస్సార్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించాలని, పేదలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి రావాలని 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే అప్పటికే ఎన్‌డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి సవాల్ విసిరిందన్నారు. అయినప్పటికీ కరోనా బారి నుంచి ప్రజలను రక్షించి, మరణాలు రేటు తగ్గించడంలో జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన దోహదం చేసిందన్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల మంజూరుకు కృషిచేశారన్నారు. కేవలం మూడేళ్లలోనే 5 కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. వీటి కోసం రూ.8 వేల కోట్లు అవసరం కాగా రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం సాధ్యమైతే 2014లో విభజన సమయంలో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్ కళాశాల ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2014లో రూ.1.19 వేల కోట్లతో డిజైన్ చేసిన అమరావతి 2019 వరకు ఎంత మేర పనులు జరిగాయని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 19 నెలలు కాలంలో రూ.2 లక్షలు కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉచిత వైద్యం అందేవరకు పోరాటం చేద్దాం
కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద కుటుంబాల విద్యార్థులు వైద్యవిద్యకు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని, దీనిని ప్రజావ్యతిరేక కార్యక్రమంగానే పరిగణించి పోరుబాట సాగిద్దామని శాసనమండలి విక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేద్దామన్నారు. సంతకాల సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కానరావడంలేదన్నారు. ఇటీవల గుర్ల మండలం జమ్ము గ్రామంలో జరిగిన సంఘటన అత్యంత దారుణమని, భవిష్యత్తులో ఫలితం అనుభవిస్తారన్నారు.
● పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనేది ప్రజావ్యతిరేక నిర్ణయమని, విద్య, వైద్యం అనేది ప్రజల హక్కు అని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టేలా జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి కళాశాలల ప్రాముఖ్యతను వివరించి సంతకాలు సేకరించాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను సోషల్‌మీడియా వేదికగా ఎండగట్టాలన్నారు. కోటి సంతకాల సేకరణ తరువాత ఈనెల 28న నియోజకవర్గ స్థాయిలో పెద్దస్థాయిలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం లభించిందన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 108, 104, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఎన్నో వైద్యసేవలు, విజయనగరంలో మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి చేపట్టిన దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించి కోటి సంతకాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, ఎస్.వి.రమణరాజు, కోట్ల విశ్వేశ్వరరావు, తాడ్డి వేణు, నాలుగు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
రూ.1.19 వేల కోట్లతో డిజైన్‌చేసిన అమరావతి ఎక్కడుంది?
2014లో మంజూరైన ఎయిమ్స్
కళాశాల పరిస్థితి ఏంటి?
ఉచిత వైద్యం అందేవరకు పోరాటం చేద్దాం
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దారుణం
కోటి సంతకాలు సేకరించి
గవర్నర్‌కు అందజేద్దాం
శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ

చంద్రబాబు చేసింది శూన్యం