
హంసవాహనంపై సిరుల తల్లి
విజయనగరం టౌన్:
మంగళవాయిద్యాలు... బాణసంచా వెలుగులు.. భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ హంస వాహనంపై పసిడి కాంతుల పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో మంగళవారం సాయంత్రం జలవిహారం చేశారు. భక్తులకు చల్లని ఆశీస్సులు అందించారు. అమ్మవారి జలవిహారాన్ని చూసేందుకు సున్నంబట్టీ వీధి సమీపంలోని చెరువు గట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారు సాక్షాత్కరించిన చెరువులో మూడుసార్లు జలవిహారం చేస్తుంటే.. గట్టుపై ఉండి కళ్లార్పకుండా తిలకించారు. పైడితల్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ స్మరించారు. చల్లని తల్లి కరుణాకటాక్షాలను అందుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు సాగిన తెప్పోత్సవానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా, ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
● వనంగుడిలో వేదస్వస్తి
వనంగుడిలో ముందుగా వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, అధికార భాషా సంఘం పూర్వపు సభ్యులు డాక్టర్ ఎ.గోపాలరావు వ్యాఖ్యానం చేశారు. వేదస్వస్తి చెప్పిన బ్రాహ్మణులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష దుశ్సాలువ, నగదు బహుమతితో సత్కరించారు. అనంతరం అమ్మవారికి పారాయణం, ఆధ్యాత్మిక అంశాలను, పైడితల్లి అమ్మవారి భజనలను వినిపించారు.
● పైడితల్లికి స్నపనం
తెప్పోత్సవానికి ముందు పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వనంగుడిలో ఆలయ అధికారులు, పైడితల్లి దీక్షాపరులు స్నపన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ఆలయం చుట్టూ మూడుమూర్లు ప్రదిక్షణ జరిపారు. అనంతరం పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, భాజాభజంత్రీలు, మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సున్నంబట్టివీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తెప్పోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జలవిహారం జరిపించారు. ఉత్సవంలో ఆలయ సిరిమాను అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉత్సవ ప్రత్యేకాధికారి మూర్తి, దీక్షాపరులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
కనులపండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
వనంగుడిలో పైడితల్లికి స్నపనం
పెద్దచెరువులో మూడుసార్లు
జలవిహారం
కనిపించని ప్రజాప్రతినిధులు
పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఈఓ, సిరిమాను పూజారికే ఈ ఏడాది ఉత్సవం మిగిలింది. ఏటా కనీసం ఐదారుగురైనా అధికారులు ఉత్సవంలో పాల్గొని, అమ్మ ఆశీస్సులందుకుంటుంటారు. ఈ ఏడాది అన్నింటికీ మించి తెప్పోత్సవం ఎవరికీ పట్టకుండా పోయింది. అయినప్పటికీ పైడితల్లి అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని భక్తిశ్రద్ధలతో ఆలయ అధికారులు నిర్వహించడం విశేషం.