
సమృద్ధిగా తాగునీటి సరఫరా
● జెడ్పీ సీఈవో సత్యనారాయణ
మెరకముడిదాం: గ్రామాల్లో తాగునీటిని సమృద్ధిగా సరఫరా చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ అధికారులకు సూచించారు. మెరకముడిదాంలో కోటి 15 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఇంటింటి కుళాయిలను ఎన్‌జేజేఎం టీమ్ ఎంపిక చేసిన స్కీమ్స్‌పై గురువారం నిర్వహించిన జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా అధికారులు బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా గ్రామంలో శివాలయం వద్ద, రామాలయం వద్ద వున్న వీధి కుళాయిలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో గ్రంథాలయాన్ని ఆనుకొని వున్న 120 కె.ఎల్ పరిమితి గల తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంకును పరిశీలించారు. అనంతరం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన రికార్డులను, ఎంపీడీవో కార్యాలయ రికార్డులను సీఈవో పరిశీలించారు. జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సరఫరా సంతృప్తికరంగా వుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీలత, ఎంపీడీవో గొర్లె భాస్కరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శివబాబు, ఈవోపీఆర్‌డీ శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు.