
సత్తా చాటిన జిల్లా స్విమ్మర్స్
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు వేదికగా నిర్వహించిన 7వ రాష్ట్ర పారా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ – 2025 పోటీల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచారని అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఏలూరులోని బిశ్వనాథ్ ఈత కొలనులో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ మెన్ కేటగిరీలో జాగరణ సత్యనారాయణ 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ పోటీల్లో సిల్వర్ మెడల్.. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడని తెలిపారు. సబ్ జూనియర్ ఉమెన్ విభాగంలో ప్రియాంకదాస్ బెస్ట్ స్ట్రోక్‌లో.. మౌనిక 50 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించారన్నారు. ఈ మేరకు విజేతలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామిలతో కలిసి సోమవారం ఆయన ప్రత్యేకంగా అభినందించారు.