గంట్యాడ: జిల్లాకు గొర్రి పాటి బుచ్చి అప్పారావు అందించిన సేవలు అమోఘమని రాష్ట్ర సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాటిపూడి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ (బుచ్చి అప్పారావు) జలా శయం నిర్మించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. ఆయన కృషివల్లే జామి, గంట్యాడ మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, కోళ్ల లలితకుమారి, ఆర్‌వీఎస్‌ఆర్‌కే రంగారావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, జనసేన నాయకుడు సురేష్, తదితరులు పాల్గొన్నారు.