
వేగావతి నదిలో భవానీ భక్తుడు గల్లంతు
బొబ్బిలి రూరల్: మండలంలోని జె.రంగరాయపురం వద్ద వేగావతి నదిలో స్నానానికి దిగిన పాటోజు యోగీశ్వర్రావు(22) అనే భవాని భక్తుడు బుధవారం గల్లంతయ్యాడు.బొబ్బిలి పట్టణంలోని కంచరవీధికి చెందిన యోగీశ్వర్రావు సహచర ఐదుగురు భవానీ భక్తులతో కలిసి బుధవారం వేగావతి నదిలో స్నానమాచరించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దిగారు. నదిలో నీటి ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు ముగ్గురు భక్తులు కొట్టుకుపోగా వారిలో వినయ్, చరణ్‌లు చెట్లపొదల్లో చిక్కుకుని ప్రాణాలతో క్షేమంగా బయటపడగా, యోగీశ్వర్రావు నదిలో కొట్టుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై కొండల రావు, ఫైర్ స్టేషన్ హెచ్‌సీబాలకృష్ణ ఆధ్వర్యంలో నలుగురు ఫైర్ సిబ్బంది నదిలో తాళ్లసహాయంతో సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు.అయినా మృతదేహం లభ్యం కాలేదు. యోగీశ్వర్రావు పట్టణంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తు కుటుంబానికి అండగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వీరాచారి, సుజాత, తమ్ముడు శ్యాంలు నదివద్దకు చేరుకుని బావురుమాన్నారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తామని ఏఎస్సై కొండలరావు విలేకరులకు తెలిపారు.

వేగావతి నదిలో భవానీ భక్తుడు గల్లంతు