
లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించాలి
విజయనగరం క్రైమ్: స్మార్ట్ పోలీసింగ్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండాలని ఎస్పీ దామోదర్ అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం ముగిసిన వెంటనే పెదమానాపురం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషను పరిసరాలు పరిశీలించి, స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్ కు వచ్చే బాధితులు, వృద్ధులు, మహిళల పట్ల అప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులపట్ల సామరస్యంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని, అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగ్‌తో ప్రజలకు మెరుగైన సేవలందించాలని, అందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడే వారిని, గంజాయి, మహిళలు పట్ల దాడులకు పాల్పడే వారిని, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.
ఎస్పీ దామోదర్