
వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలను అర్చకులు జరిపించారు. శ్రీవారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పల్లకిలో అశీనులు చేసి రామతీర్థం పురవీధుల్లో మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం యాగశాల లో పూర్ణాహుతి, అవబృదం కార్యక్రమాలను జరిపిస్తామని అర్చకులు తెలిపారు. అనంతరం భాస్కరపుష్కరిణిలో శ్రీవారికి చక్రతీర్థ స్నానం కనుల పండువగా చేయిస్తామన్నారు. 3న జరిగే పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.