
గిరిజన గురుకులంలో చావుకేకలు
కురుపాం గురుకులంలో రాలిన మరో గిరిజన విద్యాకుసుమం వారంలో రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి గిరిజన సంక్షేమశాఖ నిర్లక్ష్యమే కారణమంటున్న గిరిజన సంఘాలు తాగునీరు కలుషితంతో పచ్చకామెర్ల బారిన విద్యార్థులు స్పందించని మంత్రి కురుపాం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
కురుపాం:
గిరిజన గురుకులంలో వినిపిస్తున్న చావుకేకలు విద్యార్థిలోకాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తోయక కల్పన (15) అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఇదే పాఠశాలలో చదుతున్న గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన అంజిలి అనే బాలిక వారం రోజుల కిందట మృతిచెందింది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గురుకుల పాఠ శాలలో సదుపాయాలు లేకపోవడం, స్వచ్ఛమైన తాగునీరు అందకపోవడం, బాలికలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తరచూ అనారోగ్యంబారిన పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 611 మంది విద్యార్థినులు చదుతున్న గురుకులానికి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందని, జిల్లాకు చెందిన మంత్రి సంధ్యారాణి కనీసం పట్టించుకోవడంలేదంటూ గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు.
పచ్చకామెర్ల బారిన విద్యార్థులు
వసతి గృహంలో కలుషిత తాగునీరు కారణంగా విద్యార్థులు జ్వరాలు, పచ్చకామెర్లు బారిన పడుతున్నారు. వారంలో ఇద్దరు మృత్యువాత పడడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలకు చెందిన 50 మంది బాలికలను కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. వైద్య పరీక్షలు చేశారు. నీరజ అనే బాలికను కేజీహెచ్‌కు తరలించారు. మరికొంత మంది బాలికలు జియ్యమ్మవలస మండలం రామభద్రపురం, చినమేరంగి పీహెచ్‌సీల్లో చికిత్స పొందుతున్నారు. జ్వరాల వ్యాప్తిపై గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ పి.అనూరాధ మాట్లాడుతూ పాఠశాలలో కొద్ది రోజులుగా ఆర్‌ఓ ప్లాంట్ పనిచేయడం లేదని, బాలికలకు ప్రత్యమ్నాయంగా వేడినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపా రు. జ్వరాల బారిన పడిన వారి ని కురుపాం సీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. కొందరు విద్యార్థిను లు దసరా సెలవుల్లోనూ ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందుతుండడం గమనార్హం.
బాలికలను పరామర్శించిన పుష్పశ్రీవాణి
వారం రోజుల్లో ఇద్దరు బాలికలు మృత్యువాత పడడం, 50 మంది విద్యార్థినులను వైద్య పరీక్షల కోసం కురుపాం సీహెచ్‌సీకి తరలించిన విషయం తెలుసుకున్న మాజీ ఉపముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి సీహెచ్‌సీకి వెళ్లి పరామర్శించారు. వైద్యసేవలు పొందుతున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. చికిత్స అందిస్తున్న వైద్యాధికారి వాసును బాలికల మరణం, జ్వరాల వ్యాప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆమె వెంట కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత, వైఎస్సార్‌సీపీ నాయకులు నిషార్, శెట్టి నాగేశ్వరరావు, ఆదిల్ ఉన్నారు.

గిరిజన గురుకులంలో చావుకేకలు

గిరిజన గురుకులంలో చావుకేకలు