
జీఎస్టీ తగ్గుదల..!
మందులపై జీఎస్టీ 12 నుంచి 5
శాతానికి కుదించిన కేంద్రం
అయినప్పటికీ తగ్గని మందుల ధరలు
జిల్లాలో 1600 మందుల దుకాణాలు
వీటిపై పర్యవేక్షణ కొరవడిందనే
ఆరోపణలు
బిల్లులు కూడా ఇవ్వని వైనం
ఆదేశాలిచ్చాం..
మందులపై అమలు కాని
విజయనగరం ఫోర్ట్:
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందగా ఉంది.. జిల్లాలోని మందుల దుకాణదారుల వైఖరి. మందులపై జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ టాక్స్)ని కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 5 శాతానికి తగ్గించినా ఆ మేరకు మందుల ధరలు తగ్గించడంలేదన్న ఆరో పణలు వినిపిస్తున్నాయి. కొన్ని మెడికల్ షాపుల యజమానులు పాతధరలకే మందులు విక్రయిస్తున్నట్టు సమాచారం. దుకాణాలపై పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఇష్టానురీతిన మందులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఎక్కువగా సంతోషించారు. నెలనెలా మందుల కోసం వెచ్చించే బడ్జెట్ తగ్గుతుందని ఆశించారు. బీపీ, సుగర్, ఆస్తమా, గుండె జబ్బులు, కేన్సర్ వంటి రోగులు నిత్యం మందుల కోసం కొంత బడ్జెట్ వెచ్చించాల్సిందే. నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. జీఎస్టీ తగ్గించినా మందుల బడ్జెట్ తగ్గకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులను నిలదీస్తున్నా ధర మాత్రం తగ్గించడం లేదు. కొందరు బిల్లులు ఇవ్వకుండా మందులు మాత్రమే ఇస్తున్నారు. పాత ధరలకే మందులు విక్రయిస్తున్నారని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
జిల్లాలో 1600 మందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో హోల్‌సేల్, రిటైల్ మందులు దుకాణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గుదల అమల్లోకి వచ్చింది. మందుల ధరలు ఆ రోజునుంచే తగ్గించి విక్రయించాలి. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలి. అయి తే, దుకాణాలపై పర్యవేక్షణ లేక కొరవడడంతో పాత ధరలకే మందులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఉన్న అన్ని మందుల దుకాణాల్లో తగ్గించిన జీఎస్టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు జారీచేశాం. ఆ మేరకు ధరల బోర్డులు కూడా పెట్టమని ఆదేశాలిచ్చాం. మందుల దుకాణాలను పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలు పాటించని షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
– రజిత, జిల్లా ఔషద నియంత్రణశాఖ సహాయ సంచాలకులు