
వైద్యుల సమ్మెబాట
● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలు
సాక్షి, పార్వతీపురం మన్యం: వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమ స్యలు, డిమాండ్ల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా విధులను బహిష్కరించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులందరూ సమ్మె బాట పట్టారు. ఓపీ, అత్యవసర సేవలు కూడా నిలిపి వేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా.. మరో చోట నుంచి వైద్యులను డిప్యుటేషన్ మీద పంపినా.. ఫలితం లేకపోయింది. జిల్లాలో పల్లె వైద్యం పూర్తిగా పడకేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత నెల 26 నుంచి నిరసనలు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు పీజీ కోటా పెంచాలని, ఏజెన్సీ అలవెన్సులు ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని పీహెచ్‌సీ వైద్యులు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఆ మేరకు గత నెల 26 నుంచి వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల డిమాండ్ల పట్ల కూటమి ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో బుధవారం పూర్తిగా విధులను బహిష్కరించారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గురువారం విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు.
వైద్య సేవలకు ఆటంకం
మన్యం జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న వైద్యాధికారులు సమ్మెబాట పట్టడంతో ఆయా గ్రామాల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆయుష్, ఇతర విభాగాల నుంచి 35 మంది వైద్యులను డిప్యూటేషన్ మీద నియమించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటలూ సిబ్బందిని అక్కడ అందుబాటులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయి. పీహెచ్‌సీలు పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా పంపిన వైద్యులు కొన్ని పీహెచ్‌సీలకు మాత్రమే హాజరై, అక్కడ కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.