
గిరిజనుల విద్య, వైద్యంపై నిర్లక్ష్యం తగదు
గిరిజనులకు మెరుగైన వైద్యం, విద్యా సౌకర్యా ల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీనికి వారం రోజుల్లో కురుపాం బాలిక గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతే నిలువెత్తు నిదర్శనమని మా జీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. బాలికలు అనారోగ్యంతో మృతిచెందుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్పందించక పోవ డం ఘోరమన్నారు. కురుపాం సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్న బాలికలను పరామర్శించిన అనంతరం కురుపాం గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్, సిబ్బందితో మాట్లాడారు. పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతులకు గురైందన్నారు. అనంత రం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంత మంది బాలికలు అనారోగ్యంబారిన పడతారోనని ఆవేదన వ్యక్తంచేశారు. కురుపాం సీహెచ్‌సీలో సేవలు పొందుతున్న 50 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేశారన్నారు.
గిరిజన బాలికలకు భద్రత కరువు
గిరిజన ఆడపిల్లలకు భద్రత కరువైందని పుష్పశ్రీవాణి ఆవేదన వ్యక్తంచేశారు. బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేసి మళ్లీ రూ.లక్షల్లో లంచం తీసుకుని తిరిగి పోస్టింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై గిరిజనులకు ఏం చెప్పదలచుకుంటున్నారో..? కూటమి నాయకులు, ఐటీడీఏ అధికారులు ఆలోచించాలన్నారు.