
పారాది కాజ్‌వేపై వరద నీరు
బొబ్బిలిరూరల్: అంతరరాష్ట్ర రహదారిలో పారాది గ్రామం వద్ద వేగావతినదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్‌వేను మంగళవారం వరదనీరు ముంచెత్తింది. నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వేకువజాము నుంచి కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం ఏడు గంటలకు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు.
ఆర్థిక బకాయిలు చెల్లించండి
● ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎస్.చిరంజీవి
విజయనగరం అర్బన్: ఉద్యోగుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని, పీఆర్‌సీ కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం 30 శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. సీఆర్‌పీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. మున్సిపల్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టనున్న చలో విజయవాడ ధర్నాను విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎ.సదాశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ధనంజయరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఆర్.కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, వై.మధుసూదనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎస్.శ్రీదేవి పాల్గొన్నారు.
నేడు సీఎం చంద్రబాబు దత్తి రాక
దత్తిరాజేరు: మండలంలోని దత్తి గ్రామంలో బుధవారం చేపట్టే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పాల్గొంటారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, గిరిజన, సీ్త్ర సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి దత్తి గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పింఛన్ అందజేయనున్న లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఏర్పాట్లు, గ్రామస్తులతో మాట్లాడనున్న ప్రజా వేదిక, టీడీపీ కార్యకర్తలతో మాట్లాడనున్న వేదిక, హెలిప్యాడ్ స్థలాలను సందర్శించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దత్తి గ్రామంలో సీఎం ఉంటారని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.
మైనర్లకు హోంమంత్రి
అనిత క్లాస్
విజయనగరం క్రైమ్: చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం క్లాస్ పీకారు. సీఎం బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు దత్తికి వెళుతున్న హోంమంత్రి అనిత బెటాలియన్‌వద్ద మైనర్ల ర్యాష్ డ్రైవింగ్‌ను చూసి కాన్వాయ్‌ను ఆపించి మైనర్లను సుతిమెత్తగా మందలించారు. పిల్లలకు స్కూటీలు, బైకులు ఇవ్వడం సరికాదని తల్లిదండ్రులకు హితవుపలికారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు.

పారాది కాజ్‌వేపై వరద నీరు

పారాది కాజ్‌వేపై వరద నీరు