
స్వదేశీ నెట్‌వర్క్‌తో నాణ్యమైన సేవలు
విజయనగరం టౌన్: స్వదేశీ నెట్‌వర్క్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్టు ఆ శాఖ జనరల్ మేనేజర్ ఎం.నాయుడు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో భాగంగా మంగళవారం బీఎస్‌ఎన్‌ఎల్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 4జీ నెట్‌వర్క్‌తో సంస్థ ముందుకు వెళ్తుందన్నారు. ఏడాదిన్నర కాలంలో 45 కొత్త టవర్స్‌ను ఏర్పాటుచేశామని, 240 టవర్స్‌ను అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. యాంటీ స్పామ్ నెట్‌వర్క్‌కి చెక్ పెట్టగలిగామని, జిల్లా అంతటా ఫైబరైజేషన్ జరిగిందన్నారు. మొబైల్ నెట్‌వర్క్ రాని 20 ప్రాంతాల్లో కొత్త టవర్స్ ఏర్పాటుచేస్తున్నామని, ఆగస్టు 15న పురస్కరించుకుని నెలరోజుల పాటు రూపాయికే సిమ్ అందజేశామని, జిల్లాలో పదివేల సిమ్‌ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకూ టూజీ నెట్‌వర్క్ పనిచేసిందని, తాజాగా వాటిని ఫోర్‌జీకి అప్‌గ్రేడ్ చేశామన్నారు. డీజీఎం దాలినాయుడు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తృతం చేస్తామని స్పష్టంచేశారు. జిల్లాలో 2 లక్షల50వేలకు పైగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఉన్నారని, 100జీబీ నెట్ స్పీడ్‌ను క్వాలిటీతో అందజేస్తున్నామన్నారు. సిల్వర్‌జూబ్లీ వేడుకలలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏజీఎంలు శారద, శ్రీనివాసరావు, ప్రమోదకుమార్‌దాస్, ఎస్.లక్ష్మణరావు, మురళీ, తదితరులు పాల్గొన్నారు.