
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
● 1998 ఎంటీఎస్ ఐపాధ్యాయ
సంఘం పిలుపు
పార్వతీపురం: ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఉమా కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని చర్చివీధిలో గల వేదాంత జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో వెలుగు నింపి ఉపాధ్యాయులుగా నియమించారన్నారు. ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, 12 నెలల జీతాన్ని ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. న్యాయమైన హక్కుల సాధనకు, న్యాయపోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరారు. 98 ఎంటీఎస్ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్టోబర్ 11న విజయవాడలో నిర్వహిస్తున్న విజ్ఞాపన సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు పీవీ రామ మోహనరావు, కె.రమేష్, దామోదరరావు, పూడు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.