
స్థాయి మరచి మాట్లాడొద్దు
రామభద్రపురంలో భారీ వర్షం
రామభద్రపురం: మండల కేంద్రంలో సోమవారం రాత్రి 7.20 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. శ్రీరాంనగర్‌కాలనీని వరదనీరు ముంచెత్తింది. ఇళ్లలోకి ముడుగులోతులో నీరు చేరడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలో బీసీ వీధికి, ఎస్సీ వీధికి మధ్యలో ఉన్న మురుగునీటి కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోవడం, కాలువను రియల్‌ఎస్టేట్ వ్యాపారులు పూర్తిగా పూడ్చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి కాలువలో పూడికలు తొలగించి వర్షం నీరు మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డెంకాడ: ఇచ్చిన హామీలు అమలు చేయలేక తనపైన, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులపైన, మీడియాపైన ఇష్టం వచ్చినట్టు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భర్త లోకంప్రసాద్ మాట్లాడం సరికాదని, స్థాయిని గుర్తించుకుని మాట్లాడితే మంచిదని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. డెంకాడ మండలం పినతాడివాడలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వంద కంపెనీలు తెస్తా మని ఎమ్మెల్యే లోకం నాగమాధవి చెప్పారని, ఇంతవరకు ఎన్నిక కంపెనీలు తెచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టి స్థానిక యువ తకు ఉపాధి కల్పిస్తామంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తక్కువ ధరకే వందల ఎకరాల భూములను తీసుకున్నది నిజంకాదా అని ప్రశ్నించారు. మిరాకిల్ కంపెనీలో స్థానికంగా ఎంత మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారో బహిరంగ పరచాలన్నారు. గతంలో రుషికొండ వద్ద కంపెనీల పేరుతో భూమిని తీసుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టవచ్చనే దురాశతో రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనలేదని ఆరోపించారు. ఏడాదికి వంద కోట్లు పైబడి సంపాదిస్తున్నట్టు చెబుతున్నారు.. ముక్కాం, ముంజేరు పంచాయతీలకు చెల్లించాల్సిన సుమారు రూ.45 లక్షల పన్ను బకాయిలు చెల్లించకపోవడం ఏమిటని నిలదీశారు. పంచాయతీ అభివృద్ధికి సహకరించాల్సిన పాలకులే పన్ను చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నించారు. లోకం ప్రసాద్ అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. కొమ్మూరి అప్పడుదొరపై పోటీ చేసింది మా ఇంటి నుంచే అన్నది మరిచిపోరాదన్నారు. మిరాకిల్ సంస్థలో 55 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీనిని ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నారు. కంపెనీ నుంచి సీఎస్‌ఆర్ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. మా హయాంలో వేయించిన రోడ్లపై ప్రయాణిస్తూ చేసిన అభివృద్ధి ఏదని ప్రశ్నించడం అవివేకానికి నిదర్శనమన్నారు. మీరు చేసిన అవినీతి, ఆక్రమాలపై పోరాటంతో పాటు ప్రజలకు వివరిస్తామన్నారు. టీడీపీ అండదండలతో గెలిచారన్న విషయం మరువరాదన్నారు. సమావేశంలో డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పిన్నింటి తమ్మునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, బడ్డుకొండ ప్రదీప్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
లోకం ప్రసాద్ తీరు సరికాదు
పంచాయతీకి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి
విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ

స్థాయి మరచి మాట్లాడొద్దు