‘డిజిటల్‌ బుక్‌’తో కార్యకర్తలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌ బుక్‌’తో కార్యకర్తలకు భరోసా

Sep 30 2025 9:09 AM | Updated on Sep 30 2025 9:09 AM

‘డిజిటల్‌ బుక్‌’తో కార్యకర్తలకు భరోసా

‘డిజిటల్‌ బుక్‌’తో కార్యకర్తలకు భరోసా

విజయనగరం రూరల్‌: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి రెడ్‌బుక్‌ పాలన సాగిస్తోందని, పాలనా వైఫల్యాలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. కూటమి పాలనలో దాడులకు గురవుతున్న, అక్రమ కేసులు, అన్యాయా నికి గురవుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది సూచనతో డిజిటల్‌బుక్‌ అందుబాటులోకి తెచ్చారని, ప్రతిఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిజిటల్‌బుక్‌ను తన నివాసంలో సోమ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరభద్రస్వామి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా పార్టీ నిలుస్తుందని, అధికారంలోకి వచ్చాక ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నాడు సంక్షేమ పాలన..

ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని కోలగట్ల పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇళ్ల మంజూరు, రైతు, డ్వాక్రా రుణాల మాఫీ వంటి అనేక పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలు చేస్తే, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు, విద్యా, వసతి దీవెన, అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల అమలు, మహిళాభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేసి, సంక్షేమ సారథిగా పేరు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలు తీసుకువచ్చి వాటిలో ఐదింటిలో తరగతులు సైతం ప్రారంభిస్తే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని విమర్శించారు.

బాలకృష్ణవి దిగజారుడు వ్యాఖ్యలు

ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సినీ నటుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. చట్టసభల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలే గాని, చిరంజీవిపై ఉన్న వ్యక్తిగత కక్షను అసెంబ్లీలో ప్రస్తావించడం బాలకృష్ణ మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విజయం తధ్యమని, ప్రజలు కూటమి పాలనకు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, ఉపాధ్యక్షులు, కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ ఎస్‌వీవీ రాజేష్‌, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదుచేసినా, దాడులు చేసినా డిజిటల్‌ బుక్‌లో నమోదు చేయాలి

మాజీ డిప్యూటీ స్పీకర్‌

కోలగట్ల వీరభద్రస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement