
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి చదురుగుడిలోని హుండీల ఆదాయాన్ని అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో సోమవారం లెక్కించారు. రూ.16,75,917ల నగదు, 14.100 మిల్లీ గ్రాముల బంగారం, 301 గ్రాముల వెండి, అన్నదాన హుండీ నుంచి రూ.800లు లభించినట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష తెలిపారు. కార్యక్రమంలో శంబర పోలమాంబ ఈఓ శ్రీనివాస్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యూరియూ కోసం బారులు
సంతకవిటి: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పనులు మానుకుని ఆర్‌ఎస్‌కేలు, సచివాలయాల వద్ద క్యూ కడుతున్నారు. సంతకవిటి మండలంలోని తాలాడ, మామిడిపల్లి గ్రామాల్లో సోమవారం వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచి రైతులు సచివాలయాల వద్ద క్యూ కట్టగా ఒక్కో బస్తా చొప్పున అందజేశారు.
సీజ్ చేసిన వాహనాలు అప్పగించండి
● ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: జిల్లాలో పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను నిబంధనల మేరకు అప్పగించాలని ఎస్పీదామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. చీపురుపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గజపతినగరం పోలీస్ స్టేషన్‌ను సోమవారం తనిఖీచేశారు. స్టేషన్ ప్రాంగణంలోని వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో మరిన్ని ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చాలని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయించేవారు, మహిళల పట్ల దాడులకు, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, గజపతినగరం సీఐ జి.ఎ.వి.రమణ, ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు