
హృదయం పదిలమా..!
● మానవుని జీవన శైలిలో మార్పులు
● పెరుగుతున్న గుండెజబ్బులు
● తక్కువ వయసులోనే గుండెపోటు
● బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి
విజయనగరం ఫోర్ట్: మానవుని ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఉరుకులు పరుగులతో జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఉద్యోగులు పని ఒత్తిడికి, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారు జీవనం ఏవిధంగా సాగించాలనే అనే ఆందోళన, విద్యార్థులకు భవిష్యత్తుపై ఇలా ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక ఆందోళన ఉంటుంది.దీని వల్ల అత్యంత ప్రధానమైన గుండెకు హాని జరిగే ప్రమాదం ఉంది. సోమవారం ప్రచంచ గుండె దినోత్సవం. గుండెను పరిరక్షించుకోకపోతే మానవుని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రతి వ్యక్తి గుండెను పరిరక్షించుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సరైన ఆహార నియామలు పాటించకపోవడం, కొవ్వు అధికంగా ఉంటే ఆహార పదార్థాలను అధికంగా తినడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారు.
వ్యాధిని గుర్తించడం ఇలా
వ్యాధిలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించవు. బీపీని వైద్యులు పరీక్షల ద్వారానే గుర్తించడం సాధ్యం.రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో కష్టం, ఛాతీలో నొప్పి లక్షణాలు కనిపిస్తాయి.
అధిక రక్తపోటు
రక్తనాళాల్లో రక్తం సాధారణ ఒత్తిడికంటే ఎక్కువ ఒత్తిడితో ప్రసరించినప్పుడు దానిని అధిక రక్తపోటు అంటారు. తరచూ రక్తపోటు తనిఖీ చేయించుకోవాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.
అధిక రక్తపోటుకు కారణం:
నూడిల్స్, చాట్స్, పానీపూరీ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల, టీవీ అధికంగా చూడడం వల్ల శారీరక వ్యాయమం లేకపోవడం, ఒకే చోట 8 నుంచి 12 గంటలు పాటు పనిచేయడం, మానసిక ఒత్తిడి, సంఘర్షణ, ఆత్మన్యూనత, పొగతాగడం, ఆల్కహాల్ సేవించడం వంటి వాటి వల్ల అధిక రక్తపోటు వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రతిరోజు అరగంట పాటు వ్యాయమం చేయాలి. మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా గడపాలి. పొగతాగడం, మద్యం తీసుకోవడం పూర్తిగా మానివేయాలి. యోగా, ధైవభక్తి పెంపొదించుకోవాలి. ఉప్పు, మసాలాల వాడకం తగ్గించుకోవాలి. అధికపిండి పదార్ధాలు, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. 30 సంవత్సరాలుపై బడిన వారు ప్రతి 6 నెలలుకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

హృదయం పదిలమా..!

హృదయం పదిలమా..!