
టాస్క్‌ఫోర్స్ ఉందా? లేదా?
● మాదక ద్రవ్యాల సరఫరాపై కొరవడిన నిఘా
● ‘స్పా‘సెంటర్లపై కానరాని దాడులు
● మూడు నెలల్లో ముగ్గురు సీఐల బదిలీ
విజయనగరం క్రైమ్: పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగం. సమాజంలో పైకి కనిపించని, పోలీసుల కళ్లు గప్పి చాపకింద నీరులా సాగి పోయే అనైతిక పనులు, చట్టవ్యతిరేక చర్యలకు చెక్ పెట్టేందుకే పోలీస్ శాఖలోంచి ప్రత్యేక విభాగంగా ఏర్పడిందే టాస్క్ ఫోర్స్. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, కొకై న్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల పంపిణీ జరుగుతుంటే టాస్క్‌ఫోర్స్ నియంత్రించాలి. అయితే జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 2023 నుంచి టాస్క్ పోర్స్ వింగ్ పని తీరు జిల్లాలో అంతగా లేదంటే లేదనే పోలీస్ శాఖ చెబుతోంది. ఈ మధ్యనే విశాఖ రేంజ్ డీఐజీ కాస్త దృష్టి పెట్టడంతో జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, స్పాసెంటర్ల పనితీరుపై టాస్క్‌ఫోర్స్ వింగ్‌తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీ కాంప్లెక్స్, రింగ్ రోడ్‌లో పుట్టుకొచ్చిన స్పా సెంటర్‌లను తనిఖీ చేశారు. రెండు నెలల క్రితం సైబర్ సెల్ సీఐగా ఉన్న బంగారు పాప టాస్క్ ఫోర్స్ సీఐగా బాధ్యతలు చేపట్టి..తనకు వచ్చిన సమాచారంతో రింగ్ రోడ్‌లో ఉన్న ఓ స్పా సెంటర్ పై దాడి చేసి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు. అ తర్వాత రాజాం ఏరియాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ఆమె వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ సీఐని వీఆర్ లోకి పంపించింది పోలీస్‌శాఖ. అంతకు ముందు వన్ టౌన్ సీఐగా పని చేసిన డా.వెంకటరావు టాస్క్ పోర్స్ సీఐగా బాధ్యతలు చేపట్టి కొద్ది నెలలైనా కాలేదు. అకస్మాత్తుగా ఆయనను అనకాపల్లి టాస్క్ పోర్స్ సీఐగా బదిలీ చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి పండుగ వస్తున్న వేళ..టాస్క్ పోర్స్ సీఐగా శోభన్ బాబును నియమించింది పోలీస్ శాఖ. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, స్పా సెంటర్ లలో అసాంఘిక కార్యకలాపాలపై కొత్తగా సీఐగా బాధ్యతలు చేపట్టిన శోభన్‌బాబు ఏ విధంగా చర్యలు చేపడతారో వేచి చూడాలి.
ఎస్పీ ఆదేశాలతో చర్యలు
అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ ఆదేశాలతో చర్యలు చేపడుతున్నామని విజయనగరం ఇన్‌చార్జ్ డీఎస్పీ గోవిందరావు అన్నారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు దృష్టి పెట్టామన్నారు. ఈగల్ ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. టాస్క్ ఫోర్స్ వింగ్ పని తీరు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాలతో జరుగుతోందన్నారు. ముగ్గురు సీఐలు మారడం రోజవారీ శాఖ పనిలో భాగమేనన్నారు.