
ఎందుకంత ఆవేశం..!
పూసపాటిరేగ: ఆయన హోదా చాలా పెద్దది. ఎమ్మెల్యేకే ఆయనగారు మరి. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యేను, జనసేన నాయకులను జస్ట్ అలా కూర్చోమని చెప్పి ఆట మొత్తం ఆయనే ఆడేశారు. పెద్దరికానికి పెత్తనానికి అలవాటు పడిన ప్రాణం కాబట్టి విలేకరుల సమావేశంలో కూడా ఆయనే పెత్తనం చేసి ఎమ్మెల్యే ఆడాల్సిన ఆటను కూడా ఆయనే ఆడేశారు. ఎమ్మెల్యే చేసిన తప్పులు అధికారం మాటున ఎమ్మెల్యే చేసిన పనులు..జనానికి చూపిస్తున్న సినిమాను బయటపెట్టిన మీడియాపై ప్రసాద్ చిందులు తొక్కారు. తప్పులు ఎత్తి చూపినందుకు వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి తాట తీస్తానంటూ వార్నింగులు ఇచ్చారు. ఆవేశంతో ఊగిపోతూ తానేమిటో చూపిస్తానంటూ పెద్దపెద్ద మాటలు ఆడారు. ఇదంతా ఎమ్మెల్యే లోకం నాగమాధవి సమక్షంలో ఆదివారం భోగాపురంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఊహించని విధంగా జరిగిన సన్నివేశం. భోగాపురం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు. వందరోజుల్లో వంద కంపెనీలు వస్తాయని గతంలో చేసిన ప్రకటనకు సోషల్‌మీడియాలో తరచూ ట్రోల్ చేస్తున్నారని వందరోజుల్లో వంద కంపెనీలు ఎలా వస్తాయని తిరిగి ఆమె ప్రశ్నించారు. తమ ఆస్తులకు సంబంధించి పన్నులు ఎగవేసిన ఎమ్మెల్యే అని మీడియాలో రాయడం బాధేసిందని ఆమె స్వయంగా తెలిపారు. స్వప్రయోజనాల కోసం అధికార పార్టీ నాయకులే అధికార దుర్వినియోగానికి పాల్పడు తున్నారని పరోక్షంగా నియోజకవర్గం టీడీపీ నాయకులకు చురకలు అంటించారు. మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే భర్త ప్రసాద్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోకుండా పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయంటూ ఆవేశంతో ఊగిపోయారు. విలేకరులపై ఆవేశంతో ఊగిపోయి తాటతీస్తాను. ప్రజలను తప్పుదోవ పట్టించకండి అంటూనే ఏం పీక్కుంటారో పీక్కొండి అంటూ ఏక అసభ్య పదజాలంతో మాట్లాడడంతో సమావేశానికి వచ్చిన వారు నిశ్చేష్టులయ్యారు.
ఎమ్మెల్యే క్షమాపణ
ప్రెస్‌మీట్‌లో ఆవేశంతో మాట్లాడిన మాటల్లో ఏవైనా తప్పులు మాట్లాడి వుంటే క్షమించాలని మీడియాకు ఎమ్మెల్యే నాగమాధవి క్షమాపణ చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యేను పక్కన పెట్టి భర్త చిందులు
తాట తీస్తానంటూ మీడియాకు వార్నింగులు