
జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
విజయనగరం గంటస్తంభం: భగత్‌సింగ్, మహాత్మాగాంధీ జయంతుల సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐల ఆధ్వర్యంలో జిల్లాస్ధాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఎంఆర్ గ్రౌండ్‌లో ఆదివారం పోటాపోటీగా జరిగాయి. ఒకటవ పట్టణ ఎస్సైలు లక్ష్మీప్రసన్నకుమార్, లక్ష్మునాయుడులు పాల్గొని భగత్‌సింగ్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల వల్ల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. ఈ క్రీడాపోటీల్లో జిల్లా స్థాయిలో విన్నర్‌గా జేఎన్‌టీయూ టీమ్, రన్నరప్‌గా జీఎంఆర్‌ఐటీ టీమ్ నిలిచాయి. మొదటి విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతులు అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.రాము, సీహెచ్.వెంకటేష్‌లు మాట్లాడుతూ భగత్‌సింగ్,గాంధీజీ స్ఫూర్తితో ఏటా యువతలో క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.