
ఘనంగా మిస్టర్ ఆంధ్ర పోటీలు ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రం వేదికగా కనకల ఎర్రయ్య మె మోరియల్ మిస్టర్ ఆంధ్రా రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ మాట్లాడుతూ, కనకల ఎర్రయ్య జ్ఞాపకార్థం ఈ ఏడాది 12వ మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరా, పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం విశేషమన్నారు. ఈ సారి మొత్తం 164 మంది క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్మించారని వెల్లడించారు. విజేతలకు రూ.1.30 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులందరికీ తగిన వసతులు కల్పించామని, ఈ పోటీల ద్వారా విజయనగరం ప్రతిష్ఠను రాష్ట్రవ్యాప్తంగా చాటుకోవడమే లక్ష్యమని అసోసియేషన్ నాయకులు తెలపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కార్యదర్శి బైక్ రమేష్, నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, రాఘవరెడ్డి, రాజేందర్ రెడ్డి, జనప్రియ శ్రీనివాస్, శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.