
లాటరీ ద్వారా డ్వాక్రా బజార్ స్టాల్స్ కేటాయింపు
విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా సెర్ప్, డీఆర్ డీఏ ఆధ్వర్యంలో అక్టోబరు 8 వరకూ నిర్వహించనున్న అఖిల భారత డ్వాక్రా బజారుకు పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాని కి వచ్చినట్టు డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వచ్చిన మహిళా సంఘాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి స్టాల్స్ కేటాయింపు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా సంఘ సభ్యులకు స్టాల్స్ కేటాయింపును లాటరీ ప్రక్రియ ద్వారా డ్రా నిర్వహించారు. నాబార్డ్‌కు 60, మెప్మాకు 26, ఆర్‌వైఎస్‌ఎస్‌కి 15 స్టాల్స్ కేటాయించామన్నారు. స్టాల్స్ నిర్వహకులకు భోజనం, తాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని, శానిటేషన్ విషయంలో ఎటువంటి అలసత్వం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కలెక్టర్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. డీఆర్‌డీఏ అదనపు సంచాలకులు కె.సావిత్రి, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సెర్ప్ పీడీ రత్నాకర్, సీ్త్ర నిధి డీజీఎం సిద్ది శ్రీనివాస్, కృష్ణంనాయుడు, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, సీతా రామయ్య, లక్ష్మునాయుడు పాల్గొన్నారు.