
ఇంటర్ పరీక్ష ఫీజులకు వేళాయె..!
పాలకొండ రూరల్: రానున్న ఏడాదిలో నిర్వహించనున్న ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎటువంటి ఆపరాద రుసుము లేకుండా అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా సంబంధిత బోర్డు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుల స్వీకరణకు వచ్చే నెల 10 వరకు గడువు నిర్దేశించిన సంబంధిత బోర్డు 11 నుంచి 21 తేదీల మధ్య రూ.వెయ్యి అపరాధ రుసుముతో కలిపి చెల్లించేలా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థులు అదనపు మొత్తం చెల్లించే అవకాశం ఇవ్వకుండా వచ్చే నెలలోగా చెల్లించడం ఉత్తమమని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
ఫీజుల చెల్లింపు ఇలా..
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంఽధించిన జనరల్, ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్షల కోసం రూ.600, జనరల్ కోర్సులు చదువుతున్న ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సులు చదవుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి సబ్జెక్టులకు పరీక్ష ఫీజుగా రూ.165 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం చదువుతూ మొదటి సంవత్సరం పరీక్షలు తప్పిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ ఏడాదులకు థియరీ ఫీజుతో కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సులు చదువుతూ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సిన విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సులు చదువుతున్న విద్యార్థులు రెండేళ్లకు రూ.330 చెల్లించాలి. ప్రథమ, ద్వితీయ ఏడాదుల్లో ఉత్తీర్ణత పొంది మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాయదలచిన ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ విద్యార్థులు రూ.1,600 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో కళాశాలలు
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 15 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు–14, హైస్కూల్ ప్లస్–2, కేజీబీవీలు–14, మోడల్ స్కూల్స్–4, సాంఘిక సంక్షేమ కళాశాలలు–5, గిరిజన సంక్షేమ కళాశాలలు–9, ప్రైవేట్ విభాగంలో 38 జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కళాళాలల్లో ప్రథమ సంవత్సరం–9,050మంది, ద్వితీయ సంవత్సరం 9,100 మంది విద్యార్థులు బోధన పొందుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల్లో 2,165 పైచిలుకు విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
సకాలంలో చెల్లిస్తే మేలు
ఫీజుల స్వీకరణ ప్రారంభమైంది. విద్యార్థులు ఈ విషయం గమనించి సకాలంలో నిర్దేశిత ఫీజులు చెల్లించాలి. లేకుంటే అధనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 86 జూనియర్ కళాశాలలకు ఆదేశాలు అందించాం. యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించి, నిర్దేశిత గడువు ముగిసే సమయానికి శతశాతం ఫీజులు చెల్లించేలా చూడాలి. లేకుంటే విద్యార్థులపై అదనపు భారం పడుతుంది.
– వై.నాగేశ్వరరావు, డీఐఈవో,
పార్వతీపురం మన్యం
అక్టోబర్ 10తో ముగియనున్న గడువు
గడువు ముగిశాక రూ.వెయ్యి
అపరాధ రుసుం
సకాలంలో ఫీజులు చెల్లించాలంటున్న అధికారులు