
అభ్యంతరకర పోస్టులు పెడితే వ్యవస్థీకృత నేరం
పార్వతీపురం రూరల్ /విజయనగరం క్రైమ్: సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అభ్యంతరకర, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై పోలీసుశాఖ చర్యలు తీసుకోనున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేసినట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ రేంజ్ డీఐజీ పలు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అగౌరవ పరిచేలా, సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా పోస్టు సృష్టించేవారిని ఉపేక్షించేదే లేదని, వారిని వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీ ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో నిరంతర నిఘా పెట్టి సోషల్ మీడియాలో పెట్టే ప్రతీపోస్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు కార్యాచరణ చేశామన్నారు. ఈ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం ఎస్పీ దామోదర్ కూడా డీఐజీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టాలని డీఐజీ సూచించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి