
ప్రతిభకు ప్రోత్సాహం
● నెలాఖరు వరకు అవకాశం
● ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
బలిజిపేట/రాజాం: ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 2008నుంచి జాతీయ ప్రతిభా ఉపకారవేతనం(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాసి ఎంపికై తే వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందిస్తుంది.
ఎవరు అర్హులు
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు 2025–26విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, కస్తూర్బా, ఎయిడెడ్, ఆదర్శ పాఠవాలల విద్యార్థులు అర్హులు. తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.3.5లక్షల లోపు ఉండాలి. పరీక్షను ఈ ఏడాది డిసెబంర్ 7న నిర్వహించనున్నారు. అర్హులైన వారు పాఠశాల యాజమాన్య వెబ్‌సైట్‌లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100లు, ఎస్‌సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50లు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇచ్చిన ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ ద్వారా పరీక్ష రుసుం చెల్లించాలి.
ఇది ఎంతో ఉపయోగకరం
8వ తరగతి విద్యార్థులకు ఇటువంటి పరీక్ష నిర్వహించడం వల్ల వారికి రానున్న తరగతుల్లో మంచి విద్యపై పునాది పడుతుంది. ఇతరత్రా కాంపిటేషన్ పరీక్షలకు వెళ్లేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులకు ఉపకార వేతనం చదువుకునేందుకు ఆసరాగా ఉంటుంది.
– వి.వెంకటనాయుడు, ప్రధానోపాధ్యాయుడు,
బలిజిపేట ఉన్నత పాఠశాల

ప్రతిభకు ప్రోత్సాహం