
నిందితులకు శిక్ష పడేలా చర్యలు
● కోర్టు కానిస్టేబుల్స్‌తో ఎస్పీ సమీక్ష
విజయనగరం క్రైమ్: గ్రేవ్ కేసుల్లో పట్టుబడిన నిందితులకు శిక్షలు పడేలా కోర్టు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన డీపీఓ నుంచి జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్, కోర్టు మానిటరింగ్ అధికారులు, హెచ్‌సీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, న్యాయస్థానాల్లో వ్యవహరించాల్సిన తీరు గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితులు న్యాయస్థానాల్లో శిక్షకు గురయ్యే విధంగా చేయడంలో కోర్టు కానిస్టేబుల్స్, కోర్టు మానిటరింగ్ స్టాఫ్ పాత్ర క్రియాశీలకమని స్పష్టం చేశారు. కేసుల విచారణ సమయంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు సాక్షులు సకాలంలో హాజరయ్యేందుకు సమన్లు జారీ చేయాలని చెప్పారు. కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేసి, నిందితులు కోర్టు వాయిదాలకు రెగ్యులర్‌గా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ప్రాసిక్యూషన్ జరుగుతున్న సమయాల్లో సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కోర్టులకు హాజరై, ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును గమనించాలని ఆదేశించారు. సమష్టిగా, సమన్వయంతో నిందితులకు శిక్ష పడే విధంగా సమర్థవంతంగా పని చేసే వారికి ప్రోత్సాహక బహుమతులు, రివార్డులను అందిస్తామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. ఈ జూమ్ మీటింగ్‌లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు సీఐలు, ఎస్సైలు, లైజనింగ్ అధికారులు, కోర్టు మానిటరింగ్ స్టాఫ్, కోర్టు విధులు నిర్వహించే హెచ్‌సీలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.