
గెడ్డలో మహిళ మృతదేహం
వీరఘట్టం: మండలంలోని కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన రౌతు చిన్నమ్మడు(59) బహిర్భూమికి వెళ్లి చివరకు గెడ్డలో శవమై తేలింది. ఆమె మృతిపై ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శనివారం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన చినమ్మడు మానసిక స్థితి బాగులేదని, ఆమె ఈనెల 21న ఇంటి నుంచి బహిర్భూమి కోసం వెళ్లిందని, కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు సమీప బంధువులు, చుట్టాల ఇళ్ల వద్ద వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 23న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుమారుడు అప్పలరాజు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కొట్టుగుమ్మడకు వెళ్లే తోవలో ఉన్న బ్రిడ్జి సమీపంలో గెడ్డలో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి పరిశీలించి ఆమెను కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన చిన్నమ్మడుగా గుర్తించారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహం తరలించారు.
చెరువులో పడి భవానీ మాలాధారుడి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మడి సాయి సతీష్(24) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. దీనిపై ఏఎస్సై కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం అన్నసమారాధనకు వెళ్లేందుకు సిద్ధమై స్థానిక ఎర్రకోనేరులో స్నానానికి దిగి కాలు జారి పడిపోయిన సాయి సతీష్ కేకలు వేయడంతో సహచర భవానీ భక్తులు రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే స్పృహ కోల్పోయి కొన ఊపిరితో ఉండడంతో బొబ్బిలి సీహెచ్‌సీ హుటాహుటిన తరలించారు. దీంతో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి అచ్యుత రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలియజేశారు. సాయి సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించామని ఏఎస్సై తెలిపారు. మృతుడు సాయిసతీష్ డిప్లమోచదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇంతలో ఇలా జరిగిందని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

గెడ్డలో మహిళ మృతదేహం