
పొట్టచేతబట్టుకుని వెళ్లి..
చీపురుపల్లి రూరల్(గరివిడి): కుటుంబపోషణ కోసం పొట్ట చేతబట్టుకుని ఊరికాని ఊరు వెళ్లిన గరివిడికి చెందిన కె. ప్రసన్నకుమార్ (45) ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో గల గోదావరి స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రసన్నకుమార్‌కు రాయపూర్‌లో గల గోదావరి స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశం రావడంతో 20 రోజుల క్రితం ఇంజినీర్ హోదాలో ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి భార్యాపిల్లలను గరివిడిలో ఉంచి తాను రాయపూర్‌లో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. రాయపూర్‌లో అంతా అనుకూలంగా ఉండడంతో పిల్లలను తీసుకుని తన వద్దకు వచ్చేయాలని భార్యకు చెప్పాడు. ఈ మేరకు భార్య భవాని తన ఇద్దరు పిల్లలతో వెళ్లేందుకు సిద్ధమవ్వగా, వారికి తోడుగా మృతుని అన్నయ్య కూడా బయల్దేరాడు. వారంతా రాయపూర్ ప్రయాణమై మార్గమధ్యంలో ఉండగానే స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రసన్నకుమార్ మృతి చెందాడన్న వార్త తెలియడంతో దారిలోనే కుప్పకూలిపోయారు. ప్లాంట్‌లో నిర్మాణం జరుగుతున్న సమయంలో బీమ్ పడిపోవడంతో సంఘటన స్థలంలోనే ప్రసన్నకుమార్ ప్రాణాలు విడిచాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబపెద్ద మృతితో భార్యా పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనతో గరివిడి పట్టణంలోని టీచర్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాయపూర్‌లో గరివిడి వ్యక్తి మృతి
ఉద్యోగంలో చేరిన నెల గడవకముందే ప్రమాదం
అనాథలైన భార్యాపిల్లలు