
శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరం లీగల్: శాశ్వత ప్రజా న్యాయ పీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, అనధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ శాశ్వత ప్రజా న్యాయపీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. శాశ్వత న్యాయ పీఠం ఈ కింది సేవలకు సంబంధించిన తగాదాలను రాజీ మార్గం ద్వారా లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. బీమా, బ్యాకింగ్, ఆర్థిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రయాణికులు, వస్తువులు చేరవేసే రోడ్డు, వాయు, జల రవాణా సేవలు, పోస్టల్ టెలిఫోన్ టెలిగ్రాఫ్ సేవలు, ప్రజలకు సప్లై చేసే విద్యుత్, కాంతి, నీటి సరఫరా సేవలు, ప్రజారక్షణ వ్యవస్థ, పారిశుద్ధ్య సేవలు ఆస్పత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలకు సంబంధించిన తగాదాలను రాజీమార్గం ద్వారా కానీ లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. ఇది సులువైన ప్రత్యామ్నాయ పరిష్కారమని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీ దుర్గయ్య, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.