
జీఎస్టీ 2.0పై విస్తృత అవగాహన
● జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రతి కుటుంబానికి స్పష్టంగా వివరించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీఎస్టీ 2.0కింద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జేసీ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, మందులు, విద్య, వస్త్రాలు, రవాణా వంటి విభాగాల్లో జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ఇంటింటికి తెలియజేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్‌హెచ్‌జీ మహిళలు, గ్రామ కార్యదర్శులు, అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఇంటింటికీ వెళ్లి నిత్యవసరాలపై లబ్ధిని తెలియజేయాలన్నారు. చివరిగా వచ్చేనెల 19న జిల్లాస్థాయిలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్ డేవిడ్ అనిల్, ఎస్‌డీసీలు, అధికారులు పాల్గొన్నారు.