
● పొట్ట పోషణ కోసం
● పొట్ట పోషణ కోసం
కూలాడితే గానీ కుండాడని బతుకులు వారివి. కొండకోనలు, వాగువంకలు, చెట్టుపుట్టలు తప్ప మరో దృశ్యానికి నోచుకోని అమాయక ప్రజలు వారు. మూడు పూటలా నాలుగు వేళ్లూ నోటిలోకి వెళ్లాలంటే గ్రామం దాటి కూలి పనికి వేరే ఊరు వెళ్లేందుకు వారికి గెడ్డ దాటక తప్పదు. వర్షాకాలంలో అడారుగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆకలితో పస్తులుండలేక, పొట్టపోషణ కోసం ప్రాణాలు అరచేతబట్టుకుని ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనికి పక్కనున్న చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీ, గుంటభద్ర గ్రామానికి చెందిన గిరిజనులు మార్కొండపుట్టి గ్రామానికి చెందిన ఓరైతు సాగుచేస్తున్న మొక్కజొన్న పంటలో కూలిపనులు చేసేందుకు 10 మంది గిరిజన మహిళలు శనివారం గుంటభద్ర గ్రామం నుంచి ఉదయం వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని గ్రామానికి వస్తున్న క్రమంలో అడారుగెడ్డ ఉగ్రరూపం దాల్చింది. గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఒక్కో మహిళను పీకల్లోతు గెడ్డ నుంచి తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చాడు.
– మక్కువ