
244 స్టాల్స్‌లో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన
● నేటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్
● కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి
విజయనగరం అర్బన్: దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ వేదికగా నిలవనుందని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో ఆదివారం ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, దసరా వేడుకలు, విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ కొనసాగుతుందన్నారు. 244 స్టాల్స్‌లో హస్తకళలు, కలంకారీ, చేనేత, వెదురు, ఆర్టిఫీషియల్ నగలు, డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జ్యూట్‌బోర్డు ఉత్పత్తులు, నాబార్డు, పోచంపల్లి, గద్వాల్ వస్త్రాలు ఈ ప్రదర్శనలో విక్రయిస్తారని తెలిపారు. మన రాష్ట్రం నుంచి 26 జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.