
అమృత్‌భారత్‌కు స్వాగతం
విజయనగరం టౌన్: బరంపురం నుంచి సూరత్ (ఉద్నా) వరకు ప్రయాణించే అమృత్‌భారత్ రైల్‌ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఒడిశాలో జార్సుగుడ నుంచి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో అధికారులు రైలుకు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 4.15 గంటలకు విజయనగరం వచ్చిన అమృత్‌భారత్ రైలుకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ పచ్చజెండా ఊపారు. అమృత్‌భారత్ రైలు స్వాగత కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎమ్ మనోజ్‌కుమార్ సాహూ, సీనియర్ డీఈఎన్ ఈస్ట్ సాయిరాజ్, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ వి.రవివర్మ, బీజేపీ ప్రతినిధి రెడ్డి పావని, తదితరులు పాల్గొన్నారు.