
సాగుదీత..!
పార్వతీపురం రూరల్: పంట నష్టపరిహారం అందాలన్నా, పంటల బీమా వర్తించాలన్నా, సున్నా వడ్డీకే రుణం రావాలన్నా..ఆఖరికి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా..వాటన్నింటికీ ప్రభుత్వ గుర్తింపు కావాలి. ఆ గుర్తింపునకు ఏకై క ఆధారం ‘ఈ–క్రాప్’ నమోదు. అలాంటి కీలకమైన ప్రక్రియ మన్యం జిల్లాలో అటకెక్కింది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వస్తున్నా, ఈ–క్రాప్ నమోదు మాత్రం నత్తనడకన సాగుతోంది. గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుండగా, ఇంకా 43 శాతం పంటల వివరాలు ఆన్‌న్ లైన్‌లో నమోదు కాకపోవడంతో అన్నదాతల గుండెల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది.
నమోదులో జాప్యం..నష్టపోయేది రైతే
మన్యం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పంటలు 3,09,671 ఎకరాల్లో సాగవగా, ఇప్పటివరకు కేవలం1,76512 ఎకరాల్లో మాత్రమే ఈ క్రాప్ నమోదు పూర్తయింది. అంటే, జిల్లాలో కేవలం 57 శాతం మాత్రమే పూర్తి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరో మూడు రోజుల్లో మిగిలిన 43 శాతం ఎలా పూర్తి చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో 47 శాతం నమోదు కాగా, సాలూరులో 65 శాతంతో కాస్త మెరుగ్గా ఉంది. పాలకొండలో 54శాతం, కురుపాంలో 60శాతం నమోదైంది. గడువులోగా ఈ క్రాప్ నమోదు పూర్తి కాకపోతే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, పంటనష్టం జరిగినా ప్రభుత్వ సాయం అందే అవకాశం ఉండదు. ఇది రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది.
కొరవడిన సమన్వయం
ఈ–క్రాప్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో సజావుగా సాగాలంటే వ్యవసాయ సహాయకులు (వీఎఎ), గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ) కలిసి పనిచేయాలి. కానీ ఆచరణలో ఇది జరగడం లేదు. రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియకు దూరంగా ఉంటుండడంతో వ్యవసాయ శాఖ సిబ్బందిపైనే భారం పడుతోంది. ఇటీవల జరిగిన బదిలీల కారణంగా చాలా మంది వీఏఏలకు గ్రామాల్లోని పొలాలపై సరైన అవగాహన లేదు. దీనికితోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబ్బందిలో నిర్లక్ష్యం తాండవిస్తోందని, ప్రక్రియను మమ అనిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
సాంకేతిక సమస్యల సుడిగుండం
సమన్వయ లోపంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా ఈ–క్రాప్ నమోదుకు అడ్డంకిగా మారాయి. మారిన నిబంధనల ప్రకారం సర్వే నంబర్ వారీగా పొలాన్ని జియో–ట్యాగింగ్ చేసి, ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు, అనేక మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు వేధిస్తున్నాయి. రైతుల బయోమెట్రిక్ వేయాలన్నా, ఐరిస్ నమోదు చేయాలన్నా సాంకేతికత సహకరించడం లేదు. భూముల సర్వే జరిగిన గ్రామాల్లోని ఎల్పీ నంబర్లకు, పాత సర్వే నంబర్లకు మధ్య తేడాలు ఉండడంతో నమోదు మరింత సంక్లిష్టంగా మారింది. మరో మూడు రోజుల్లో అద్భుతం జరిగి, ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే..ఖరీఫ్‌లో చెమటోడ్చి పంట పండించిన రైతన్న కన్నీరు పెట్టుకోక తప్పదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యేక చర్యలు చేపట్టి, ఈ–క్రాప్ నమోదును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆందోళనలో అన్నదాతలు
నిన్న యూరియా కొరత..నేడు ఈక్రాప్‌లో అలసత్వం
జిల్లాలో 57శాతం పూర్తయిన ఈ క్రాప్ నమోదు
గడువు ఇంకా మూడు రోజులే