
ఇటుకల తయారీ కార్మికుడి ఆత్మహత్య
పాలకొండ రూరల్: పైళ్లె పదేళ్లయినా పిల్లలు లేకపోవడంతో కుంగిపోయాడు. తనతోపాటు వివాహాలు చేసుకున్న వారంతా పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతుంటే వారిని చూసి నిరాశకు లోనయ్యాడు. అంతా ప్రశ్నిస్తుంటే తీవ్ర మనస్తాపం చెంది చివరకు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కువ గ్రామంలోని కుమ్మరవీధికి చెందిన బుడుమూరు రవి(37)కి ఆదే గ్రామానికి చెందిన లక్ష్మితో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం భార్యాభర్తలు ఇటుకల తయారీ కార్మికులుగా పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. రెండు నెలల క్రితం భార్య, మరో ఇద్దరు కార్మికులతో కలిసి బతుకుతెరువులో భాగంగా పాలకొండ సమీపంలో ఇటుకల తయారీ పనిలో రవి చేరాడు. తనకు పిల్లలు కలగకపోవడంతో నిత్యం సహచరుల వద్ద ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆరోగ్యం బాగా లేదని, వైద్యులకు చూపించుకుంటానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వచ్చేశాడు. చీకటి పడినా ఇంటికి చేరక పోవడంతో భార్య లక్ష్మి ఇటుకల బట్టీ నిర్వాహకుడు శ్రీనివాసరావును వాకబు చేసింది. వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. శుక్రవారం పాలకొండ–వీరఘట్టం ప్రధాన రహదారిలో గజాలకానా సమీపంలో ఓ తోట గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశంలో పురుగుమందు డబ్బా, ఓ గ్లాసు, వాటర్ బాటిల్‌తోపాటు సెల్ ఫోన్‌ను గుర్తించారు. ఫోన్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా మృతుని వివరాలు సేకరించి, స్థానికంగా ఉన్న భార్యకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆమె స్థానిక ఏరియా ఆస్పత్రికి చేరుకుని పిల్లలు కలగకపోవడంతో తన భర్త పడ్డ వేదన తలుచుకుంటూ మృతదేహంపై పడి గుండెలు పగిలేలా రోదించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్ల: మండలంలోని దమరసింగికి చెందిన పిన్నింటి సత్యనారాయణ(27) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..పిన్నింటి సత్యనారాయణకు వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఉండలేక ఈనెల18న సత్యనారాయణ గడ్డి మందు తాగేశాడు. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా వారం రోజుల చికిత్స ఆనంతరం శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇటుకల తయారీ కార్మికుడి ఆత్మహత్య