
హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
● క్లూస్ టీమ్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్‌తో ఆధారాల సేకరణ
బొండపల్లి: మండలంలోని కొండకిండాం గ్రామంలో సంచనలం సృష్టించిన ఆస్తి విషయంలో తండ్రిని హత్య చేసిన కొడుకు ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గజపతినగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జీఏవీ రమణతో పాటు, స్థానిక ఎస్సై యు.మహేష్‌లు గురువారం రాత్రి నుంచి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హత్యకు గురైన పెద్దమజ్జి నాయుడుబాబుపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసిన తర్వాత కుమారుడు గణేష్‌కుమార్ పరారీ కావడంతో ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి హత్య వివరాలను పోలీసులు సేకరించారు. నిందితుడు గణేష్ కుమార్ వేపాడలోని మోడల్ స్కూల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. తండ్రి ఆరోగ్యం కోసం వైద్య ఖర్చులకు గాను భూమిని ఆమ్మే క్రమంలో తండ్రీకొడుకుల మధ్య కొద్ది రోజులుగా నడిచిన ఆస్తి వివాదం ఈ హత్యకు దారి తీసిసట్లు పోలీసులు గుర్తించి నిర్దారణకు వచ్చారు. మృతురాలి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన కేంద్రాస్పత్రికి తరలించారు. హత్యచేసేందుకు నిందితుడు ఉపయోగించిన రాడ్డుతో పాటు ప్రాథమిక ఆధారాలను క్లూస్ టీమ్‌తో పాటు, రీజియన్ ఫోరెనిక్స్ సైన్స్ లేబొబరేటరీ టీమ్‌తో సేకరించినట్లు సీఐ రమణ తెలిపారు. నిందితుడిని తర్వలోనే పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ చెప్పారు.