
మత్తు పదార్థాలను పూర్తిగా నివారించాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి కోరారు. జిల్లాలో పూర్తిస్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. ముందుగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లా మీదుగా గంజాయి రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే వివిధ చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. మత్తుపదార్థాలను గుర్తించేందుకు రెండు డాగ్ స్క్వాడ్‌లను కూడా వినియోగిస్తున్నామన్నారు. పాత నేరస్తులపైనా దృష్టి సారించి మత్తుపదార్థాల వినియోగాన్ని మానిపించేందుకు జిల్లాలో డీ అడిక్షన్ సెంటర్‌ను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టువచ్చునని ఎస్పీ అభిప్రాయ పడ్డారు. కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ నేరాలను అరికట్టడంలో మన జిల్లా మెరుగైన స్థానంలో ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలను అరికట్టడంలో 6వ స్థానంలో నిలిచామని చెప్పారు. జిల్లాలో మత్తుపదార్థాలను, గంజాయిని పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ వినియోగం, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యపడుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో ఏఎస్పీ సౌ మ్యలత, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జెడ్‌పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, డీఎస్‌డబ్ల్యూఓ వెంకటేశ్వరరావు, డీబీసీడబ్ల్యూఓ జ్యోతిశ్రీ వయోజనవిద్య డీడీ సోమేశ్వరరావు, ఆర్‌డీఓలు, డీఎస్పీలు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి