
పీహెచ్‌సీ ఎదుట మృత శిశువుతో నిరసన
పూసపాటిరేగ: మండలంలోని రెల్లివలస పీహెచ్‌సీలో ప్రసవ సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందిందని శుక్రవారం మధ్యాహ్నం బాలింత బంధువులు నిరసనకు దిగారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. చల్లవానితోట పంచాయతీ కొండగుడ్డికి చెందిన గర్భిణి వాళ్లె రాధికకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రసవం కోసం రెల్లివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జాయిన్ చేశారు. ప్రసవ సమయం కావడంతో ఆస్పత్రిలో ఉండాలని సిబ్బంది సూచించారు. శుక్రవారం తెల్లవారు జాము 3 గంటల నుంచి నొప్పులు తీవ్రం కావడంతో పీహెచ్‌సీ స్టాఫ్ నర్సు విజయ ప్రసవం చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ప్రసవానికి ఇబ్బందులు ఏర్పడడంతో వైద్యాధికారి భాగ్యరేఖను ఫోన్‌లో సంప్రదించారు. ఉదయం 8 గంటల వరకు ప్రసవం అవకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది, పీహెచ్‌సి సిబ్బంది అతి కష్టంమీద ప్రసవం చేయించడంతో మగబిడ్డ జన్మించాడు. పీహెచ్‌సీకి చేరుకున్న వైద్యురాలు భాగ్యరేఖ పుట్టిన శిశువును పరీక్షించి ప్రమాదమని గుర్తించి అత్యవసరంగా విజయనగరం ఘోషా ఆస్పత్రికి 108 వాహనంలో పంపించారు. ఆస్పత్రికి వెళ్లేటప్పటికే శిశువు మృతి చెందడంతో శిశువుతో పాటు బంధువులు రెల్లివలస పీహెచ్‌సీకి చేరుకుని వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారి భాగ్యరేఖ స్పందిస్తూ గర్భిణి ప్రసవం ఆస్పత్రిలో చేస్తానని స్టాఫ్‌నర్సు విజయ తెలిపారన్నారు. ఆకస్మికంగా హైరిస్క్‌లోకి వెళ్లడంతో గర్భిణికి చేయాల్సిన చికిత్స చేస్తూ సుందరపేట ఆస్పత్రి గైనకాలజిస్ట్‌ను సంప్రదించినట్లు తెలియజేశారు. ప్రసవ సమయంలో బేబి తల బయటకు వచ్చి ఆగిపోవడంతో హైరిస్క్ అని గుర్తించామన్నారు. 108 సిబ్బంది వచ్చి బేబిని బయటకు తీయడంతో హైరిస్క్‌లోకి వెళ్లిపోగా ఘోషా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శిశువు మృతి చెందినట్లు ఆమె వివరించారు. అనంతరం బంధువులు ఆందోళన ముగించి వెనుదిరిగారు.