
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పతకాలు
● క్రీడాకారులకు మాజీ డిప్యూటీ స్పీకర్
కోలగట్ల అభినందనలు
విజయనగరం: కలియుగ భీముడు కోడిరామమూర్తి స్ఫూర్తితో జిల్లాలోని బాడీ బిల్డర్‌లు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షించారు. ఈనెల 24న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను కోలగట్ల శుక్రవారం అభినందించి సత్కరించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏడుగురు క్రీడాకారుల్లో ఐదుగురు పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. పోటీల్లో వరుణ్ బంగారు పతకంతో స్కూటీని గెలుపొందాడన్నారు. 75 కేజీల విభాగంలో జి.రమేష్ బంగారు పతకం సాధించగా, మెన్స్ ఫిజిక్‌లో పి.వంశీ వెండి పతకం, 55 కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో 4వ స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. 80 కేజీల విభాగంలో ఎస్‌కె.సుభాన్ 3వ స్థానం దక్కించుకోగా..ఫిజికల్లీ ఛాలెంజెండ్ విభాగంలో బి.సాయి బంగారు పతకం కై వసం చేసుకున్నట్లు వివరించారు. ఈనెల 28న విజయనగరం వేదికగా నిర్వహించే మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తాచాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ, కార్యదర్శి బైక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.