
కఠిన శిక్షలతోనే వేధింపులకు అడ్డుకట్ట
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో మహిళలపై వివక్ష, దాడులు పెరుగుతున్నాయని, మూడేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అశ్లీల చిత్రాలు చూడడమే దీనికి కారణమన్నారు. కలెక్టరేట్‌లో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వేధింపులు చెప్పుకోలేక కొంతమంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే వేధింపులకు పాల్పడడానికి భయపడతారని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆడపిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధచూపాలని కోరారు. పిల్లలకు సురక్షితమైన భద్రత కల్పిస్తున్నామా?లేదా? అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. పిల్లలు, మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ఎంతమంది ఉపయోగించుకుంటున్నారని చేతులు ఎత్తమని అడగ్గా కేవలం ఇద్దరు మాత్రమే చేతులు ఎత్తడం గమనర్హాం. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముద్దాయిలు కూడా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చన్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. బాలికలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమాంతాలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ హిమబిందు, మహిళా కమిషన్ డైరెక్టర్ నాగమణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.