
గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా
● ఎస్పీ ఏఆర్ దామోదర్
చీపురుపల్లి: గంజాయి రవాణాతో పాటు వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ గది, స్టాఫ్ వెయిటింగ్ రూం, రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెడునడత కలిగిన వారి పట్ల నిఘా ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంపై ఎస్పీ రివార్డు ప్రకటించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్‌ఐ ఎల్.దామోరరావు పాల్గొన్నారు.
పైడితల్లి జాతరకు
2వేల మందితో బందోబస్తు
విజయనగరం క్రైమ్: పైడితల్లి తొలేళ్లు, సిరిమానోత్సవానికి 2వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టంచేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉత్సవ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఆలయం ప్రాంగణం సమీపంలో తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూంలోని టీవీలకు అనుసంధానం చేయాలన్నారు. పండగలో జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ జరగకుండా ప్రత్యేకంగా క్రైం బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, సూరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.