
బాలకృష్ణకు రాజకీయ పరిజ్ఞానం శూన్యం
● ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు రాజకీయ పరిజ్ఞానం శూన్యమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలోని తన నివాసంలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా సినీనటుడు చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సినీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యంపై చిరంజీవి చెప్పిన సమాధానికి బాలకృష్ణ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఒక్కరే హీరో అనుకుంటూ చిరంజీవిని చేతగాని వారిలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆయన అభిమానులు బాధపడతారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సినీరంగంలో మాదిరిగానే శాసనసభలో బాలకృష్ణ ఎటువంటి గౌరవమర్యాదలు పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. సినిమా అభిమానులు దగ్గరకు వస్తేనే వారిపై భౌతికదాడులు చేసే బాలకృష్ణ... ఎవరికి మతిస్థిమితం సరిగ్గా లేదో తెలుసుకోవాలన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో జైలు ఊచలు లెక్కపెట్టకుండా బయటపడిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. సభలో లేనిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి కోసం అగౌరవంగా మాట్లా డటం సరికాదన్నారు. హోదా, స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఓట్లేసి గెలిపించిన హిందూపురం నియోజకవర్గం ప్రజల కోసం ఏ రోజైనా సభలో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. ఇదే సందర్బంలో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభలో లేని వ్యక్తం కోసం అగౌరవంగా మాట్లాడటం తప్పని చెప్పకపోవడాన్ని తప్పుపడుతున్నామన్నారు.