
ఆస్తికోసం.. కన్నతండ్రినే కడతేర్చాడు..
బొండపల్లి: ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా పెంచారు. ప్రయోజకుడయ్యాక ఓ ఇంటివాడిని చేశారు. కష్టాల్లో ఆదుకుంటాడని భావించారు. చివరకు కన్నతండ్రి ఆరోగ్య కష్టాలను పట్టించుకోకుండా ఆస్తి కోసం దారుణంగా హతమార్చిన ఘటన బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యు.మహేష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకిండాం గ్రామానికి చెందిన పెద్దమజ్జి నాయుడుబాబు(72), సత్యవతి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు గణేష్‌కుమార్. ఆయన తన భార్యతో కలిసి వేపాడలో నివసిస్తూ అక్కడ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నాయుడుబాబు ఆరోగ్యం ఇటీవల క్షీణించింది. నడవలేని స్థితిలో కాళ్లకు శస్త్రచికిత్స అవసరం కావడంతో డబ్బుల కోసం కొడుకును సంప్రదించాడు. ససేమిరా అనడంతో ఆస్పత్రి ఖర్చుల కోసం కొంత భూమిని అమ్మకానికి పెట్టాడు. భూమిని కొనుగోలుచేసిన వారు డబ్బులు ఇవ్వడంతో ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇదే విషయంపై తండ్రితో కొడుకు పలుసార్లు గొడవకు దిగాడు. ఈ వయసులో ఆపరేషన్ ఎందుకంటూ ప్రశ్నించాడు. కొడుకు నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ మృతుడు బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకూడా చేశారు. ఈ క్రమంలో ఆస్తి విషయమై తండ్రీకొడుకుల మధ్య గురువారం రాత్రి మాటామాటా పెరిగింది. మారణాయుధంతో తండ్రిపై కొడుకు దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. తండ్రి చనిపోయాక కొడుకు పరారయ్యాడు. సమాచారం అందుకున్న గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్సై మహేష్, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. హత్యకు గల కారణాలను ఆరా తీసింది. హత్యకు ఉపయోగించిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకుంది. నాయుడుబాబు మృతితో భార్య సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆదుకుంటాడనుకుంటే హతమార్చాడంటూ రోదిస్తోంది.

ఆస్తికోసం.. కన్నతండ్రినే కడతేర్చాడు..