
గిరిజన వర్సిటీ పనులను వేగవంతం చేయాలి
● కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో నిర్మితమవుతున్న గిరిజన యూనివర్సిటీ పనులపై తన చాంబర్‌లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా పనుల స్థితిగతులపై ఆరా తీశారు. సుమారు 1.3 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన యూనివర్సిటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వర్సిటీ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు, గేటు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలను బయటకు జరిపేందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయాలని సూచించారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమణి, బొబ్బిలి ఆర్డీఓ రామ్మోహన్, ట్రాన్స్‌కో ఈఈ శ్రీచరణ్, డీ–సెక్షన్ సూపరింటెండెంట్ టి.గోవింద, ఆయా మండలాల తహసీల్దార్లు, వర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
చెరువుల అభివృద్ధి పనులకు ఆమోదం
జలవనరుల శాల ఆధ్వర్యంలో ఆర్‌ఆర్‌ఆర్ కింద రూ.56 కోట్లు అంచనాతో 102 చెరువుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. నీటివనరుల పునరుద్ధరణ, పరిరక్షణ, ఆక్రమణల నుంచి రక్షించడం, తాగునీటి లభ్యతను పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే పనులకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిబంధనలను అనుసరించి జిల్లాలో 7,900 చెరువులు ఉండగా వాటిలో కేవలం 102 చెరువులకే ప్రతిపాదనలు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.