
వరి పంటపై తెగుళ్ల దాడి
● నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న రైతులు
● ఎకరాకు రూ.800 నుంచి రూ.1000 వరకు ఖర్చు
● పట్టించుకోని వ్యవసాయ శాఖ
విజయనగరం ఫోర్ట్: అన్నదాతను కష్టాలు వీడడం లేదు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఆందోళన చెందారు. ఆలస్యంగా వర్షాలు కురవడంతో అష్టకష్టాలు పడి వరి పంట సాగు చేశారు. పంటకు ఎరువు వేద్దామంటే కూటమి సర్కార్ రైతులకు దొరకకుండా చేసింది. యూరియా కోసం అన్నదాతలు ఎన్నడూ లేనివిధంగా పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో యూరియా కోసం రైతుల తోపులాటలు, ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో అన్నతాతకు అన్నీ కష్టాలే. తాజాగా వరి పంటను వివిధ రకాల తెగుళ్లు అశించాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి పంటను సాగు చేస్తే ఒకదాని తర్వాత మరో కష్టం వచ్చి పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
95 వేల హెక్టార్లలో వరి సాగు
జిల్లాలో వరి పంట 95 వేల హెక్టార్లలో సాగైంది. వరిపంటకు కొన్ని ప్రాంతాల్లో బాక్టీరియా తెగులు, మరి కొన్ని ప్రాంతాల్లో పొడ తెగులు అశించగా, కొన్ని ప్రాంతాల్లో ఆకుముడత తెగులు అశించింది. మరికొన్ని ప్రాంతాల్లో సుడిదోమ అశించింది.
వేలల్లో ఖర్చు చేస్తున్న రైతులు
వరిపంటకు అశించిన తెగుళ్ల నివారణకు రైతులు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. వరిపంటకు రెండు, మూడు తెగుళ్లు అశించడంతో వాటిని నివారించేందుకు పురుగు మందుల కోసం రూ.800 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు.
సూచనలు ఇచ్చే వారేరీ?
వరి పంటకు తెగుళ్లు, చీడపీడలు అఽశించిన నేపథ్యంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే వారు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి పంటకు అశించిన తెగులుకు ఏ పురుగు మందు పిచికారీ చేయాలో తెలియక రైతులు నేరుగా పురుగు మందుల డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే మందులనే పంటకు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల సరైన మోతాదులో, సరైన మందు పిచికారీ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
కానరాని వ్యవసాయ సిబ్బంది పర్యటనలు
రైతుల పొలాల్లో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సిబ్బంది పర్యటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లయితే వరిపంటకు అశించే తెగుళ్లు, చీడపీడలను గుర్తించి అక్కడికక్కడే రైతులకు సూచనలు, సలహాలు, నివారణ చర్యల గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. పొలం బడి కార్యక్రమం కూడా తూతూ మంత్రంగానే జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ సిబ్బంది, అధికారులు కార్యాలయాలకే పరిమితమ వుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూరియా పంపిణీలో సిబ్బంది బిజీ
వరి పంటకు తెగుళ్లు అశించినట్లు గుర్తించాం. యూరియా పంపిణీలో ఇంతవరకు వ్యవసాయ సిబ్బంది బిజీగా ఉన్నారు. పొలం బడి కార్యక్రమాల్లో రైతులకు సూచనలు, సలహాలు అందించనున్నాం. రైతులు డీలర్ దగ్గరికి వెళ్లినప్పడు వ్యవసాయ సిబ్బందికి ఫోన్ చేసి వారు చెప్పిన పురుగు మందులను మాత్రమే వినియోగించాలి. లైసెన్సులు లేకుండా నేరుగా గ్రామాలకు తెచ్చే డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయవద్దు.
భారతి, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి

వరి పంటపై తెగుళ్ల దాడి