గరుగుబిల్లి: మండలంలోని శివ్వాం గ్రామ పరిసరాల్లో నాగావళి నది ఒడ్డున గురువారం ఉదయం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్సై ఫకృద్దీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన నల్ల కాంతం దమయంతి(59) కొన్నేళ్లుగా మతిస్థిమితం లేకపోవడంతో రావుపల్లి, శివ్వాం గ్రామాల్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు భర్త, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగానే ఉంటోంది.
నాలుగు రోజుల నుంచి రావుపల్లిలో గాని, శివ్వాంలో గాని కనిపించకపోవడంతో మృతురాలి అన్నయ్య చంద్రరావు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు గాలించి గురువారం శివ్వాం గ్రామపరిధిలో నాగావళి నది ఒడ్డున మృతదేహాన్ని గుర్తించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో మల్లివీడు జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వనం ఈశ్వరరావు(57) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై నవీన్‌పడాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండలం చిన్నిపాలెం గ్రామానికి చెందిన ఈశ్వరరావు తన సమీప బంధువు ఎస్.రామకృష్ణతో కలిసి మండలంలోని లింగంపేట గ్రామంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్తుండగా మల్లివీడు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ పడిపోయారు. దీంతో బైక్ వెనుక కూర్చున్న ఈశ్వరరావు తీవ్ర గాయాలు పాలవగా విశాఖ కేజీహెచ్‌కు తరలించాచగా చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో యువకుడి గల్లంతు
బొబ్బిలి: పట్టణంలోని గొల్లపల్లికి చెందిన వర్రి మధు ఆ గ్రామ వెంగళరాయ సాగర్ చెరువులో గల్లంతైనట్లు తండ్రి దాడియ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో తాపీ పని చేసుకుని జీవించే తన మూడవ కుమారుడు చెరువులో స్నానం చేసి వస్తానని సైకిల్‌పై వెళ్లి తిరిగి రాలేదు. చివరకు వెతకగా చెరువు గట్టుపై కుమారుడి బట్టలు, సైకిల్ ఉన్నట్లు కుటుంబసభ్యులు గుర్తించి ఫిర్యాదు చేయగా ఏఎస్సై డి.కొండల రావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ కుమార్ తెలిపారు.
జీతాల బకాయి చెల్లింపునకు చర్యలు
పార్వతీపురం రూరల్: ‘అమ్మను కాపాడే అతివకే గండం’ అని బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఐటీడీఏ ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి స్పందించారు. గిరిజన గర్భిణుల వసతిగృహాల సిబ్బందికి బకాయి పడిన పదినెలల జీతాలను చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే భవిష్యత్‌లో వసతిగృహాలకు పూర్తిస్థాయి పోస్టులు మంజూరైతే వారికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.