
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: మహిళా పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి విజయనగరంలోని రాజీవ్ స్టేడియం, మేదరవీధికి చెందిన గ్రంధి పైడిరాజు అలియాస్ రాజు (38)కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.2 లక్షలను మంజూరు చేయాలని గురువారం తీర్పు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మేదరవీధికి చెందిన గ్రంధి పైడిరాజు ఓ బాలికను ఏప్రిల్ నాలుగవ తేదీన స్కూటీపై వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఘోషా ఆస్పత్రిలో తల్లి చేర్పించి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి పై విధంగా తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరపున పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెట్ట ఖజానారావు వాదనలు వినిపించారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్సై కేవీ నరసింహారావు, హెచ్‌సీలు సీహెచ్.రామకృష్ణ, కేఏ నాయుడు, కానిస్టేబుల్స్ కె.గోవింద, జి.సూరపు నాయుడు, పి.రమేష్, కె.నాగమణిని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.